చైనాలో పుట్టుకువచ్చిన కరోనావైరస్ ఇప్పుడు 60కుపైగా దేశాలకు పాకింది. భారత్‌లోనూ దీని ప్రకపంనలు మొదలయ్యాయి.అయితే, ఈ వ్యాధి రాకుండా చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.ఇందుకు కారణం ఏంటి? అసలు వ్యాక్సిన్ వస్తుందా
కరోనావైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు పడ్డాయి. జంతువులపై ప్రయోగించే వ్యాక్సిన్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆ ప్రయోగాలు సవ్యంగా సాగితే, ఈ ఏడాది ద్వితీయార్థంలో మనుషులపై ప్రయోగాలు మొదలుకావొచ్చు.
ఒకవేళ ఈ ఏడాది చివరి వరకూ శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాల్లో విజయవంతమైనా, వాటిని భారీగా ఉత్పత్తి చేయడం పెద్ద సవాలే.
వాస్తవికంగా ఆలోచిస్తే, వచ్చే సంవత్సరం మధ్యలోకి వచ్చేవరకూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చు.
పైగా కాలంతో పరుగులుపెడుతూ, కొత్త విధానాల్లో శాస్త్రవేత్తలు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి, అంతా ప్రణాళిక ప్రకారం సజావుగా జరుగుతుందని కూడా చెప్పలేం.
మనుషులకు సోకే కరోనావైరస్ రకాలు ఇప్పటికే నాలుగు ఉన్నాయి. వాటి వల్ల జలుబు వస్తుంది. వాటిలో దేనికీ ఇప్పటి వరకూ కూడా వ్యాక్సిన్ లేదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
వయసు పైబడ్డవారికి ఆ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేసే అవకాశాలు చాలా తక్కువ.
వయసు మీదపడ్డవారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వ్యాక్సిన్లకు అది అంతగా స్పందించదు. ఫ్లూ వ్యాక్సిన్ల విషయంలో జరిగేదదే.
ఇక అన్ని ఔషధాలకూ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అభివృద్ధి చేసే వ్యాక్సిన్‌కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో క్లినికల్ పరీక్షలు నిర్వహించకుండా తెలుసుకోవడం అసాధ్యం.